ఫిబ్రవరి 28 : ఆర్ధిక అక్షరాస్యత వారోత్సవాలలో భాగంగా ‘పొదుపు చేసే మహిళా సాధిస్తుంది ఘనత’ అనే అంశం పై లీడ్ బ్యాంకు ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కార్యాలయాల సముదాయంలో మహిళా స్వయం సహాయక సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, మహిళలకు ఆర్థిక అక్షరాస్యత ఎంతో అవసరమని, మహిళలు డబ్బులను పొదుపు చేసుకోవడానికి ప్రణాళికను రూపొందించుకోవాలని, అనవసరమైన ఖర్చులను తగ్గించి, వ్యాపార లావాదేవీల ద్వారా లాభాలు ఆర్జించడమే కాకుండా, ఆర్థికపరమైన నిర్వహణ అంశాల గురించి కూడా అవగాహన పెంపొందించుకోవాలని అన్నారు. అధిక వడ్డీ లకు ప్రైవేట్ సంస్థలు, వ్యక్తుల నుంచి అవసరాల కోసం రుణాలు తీసుకుంటే పెద్ద మొత్తంలో వడ్డీలు చెల్లించాల్సి వస్తుందని, తద్వారా ఆర్థికంగా నష్టం కలుగుతుందని అన్నారు. ప్రభుత్వం మహిళా సంఘాలకు అందిస్తున్న తోడ్పాటును పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుంటూ ఆర్ధిక అక్షరాస్యతను పాటించడం ద్వారా ఆర్ధిక పురోగతి సాధించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆర్ధిక అక్షరాస్యతపై అవగాహన కల్పించేందుకు ముద్రించిన గోడప్రతులను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జెడ్పి సీఈఓ సాయాగౌడ్, లీడ్ బ్యాంకు మేనేజర్ అశోక్ చౌహన్ తదితరులు పాల్గొన్నారు.